Kodali Nani: మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్తున్న కొడాలి నాని..

మాజీ మంత్రి, వైసీపీ (YCP) సీనియర్ నేత కొడాలి నాని (Kodali Nani) కొంతకాలంగా ఆరోగ్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ముంబైలో గుండెకు సంబంధించి బైపాస్ శస్త్రచికిత్స (Bypass surgery) చేయించుకున్నారు. మొదటగా హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు నానీ గుండెలో మూడు రక్తనాళాలు పూర్తిగా పూడిపోయినట్లు గుర్తించారు. ఇది తీవ్రమైన పరిణామం కావడంతో, అత్యవసరంగా ముంబైకి తరలించి అక్కడ శస్త్రచికిత్స చేయించాల్సిన అవసరం ఏర్పడింది.
ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌లో (Asian Heart Institute) సుమారు ఎనిమిది గంటల పాటు నానీకి బైపాస్ సర్జరీ జరగింది. ఆ సమయంలో ఆయన పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, కొన్ని రోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నాని హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. ఆరోగ్యపరంగా పూర్తిగా కోలుకునే వరకూ రాజకీయ వ్యవహారాలకు పూర్తిగా విరామం ఇచ్చారు. ఈ సమయంలో జగన్ (Jagan) ఫోన్ ద్వారా నానీ ఆరోగ్యాన్ని తెలుసుకున్నారు. ప్రస్తుతం నానీ చాలా శాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటూ, అత్యవసరమైన వ్యక్తులను మాత్రమే కలుస్తున్నట్లు సమాచారం.
నానీ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, తాజాగా మరో కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. నానీ మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాతే విదేశీ ప్రయాణంపై ఆలోచించమని వైద్యులు సూచించారని సమాచారం. ఇప్పుడైతే ఆయన ఆరోగ్యపరంగా ప్రయాణానికి అనుకూలంగా ఉన్నట్లు భావించడంతో, అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఈ ప్రయాణంలో నానీ మెరుగైన చికిత్సతోపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. గుండె సంబంధిత చికిత్సల్లో అమెరికా వైద్య సేవలు అత్యుత్తమంగా ఉండటంతో, ఆయనే కాదు, కుటుంబసభ్యులు కూడా ఈ నిర్ణయానికి మద్దతిచ్చినట్లు సమాచారం. నానీ త్వరగా కోలుకొని గుడివాడకు (Gudivada) తిరిగి రావాలని, మళ్లీ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యం పై ఇంకా ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలువురు నాయకులు భరోసా ఇచ్చారు.