Kodali Nani: నానీ భయపడ్డారా..? మీడియాతో దూరంగా…!
ఏపీలో వైసీపీ నేతలు ఒక్కొక్కరిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడుతోంది. గత ఐదేళ్ల నుంచి రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకులను ఒక్కొక్కరిగా అరెస్టులు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారనే దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా మరో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేరు కూడా వినపడుతుంది. ఇక ఇదే సమయంలో కృష్ణాజిల్లా నుంచి కొడాలి నాని(Kodali Nani) పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది.
కొడాలి నాని తన అరెస్టు విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కొడాలి నానికి మీడియా ముందు అవకాశం దొరికితే గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ విజయవాడలో వల్లభనేని వంశీ మోహన్ ను వైయస్ జగన్(Ys Jagan) పరామర్శించడానికి వచ్చినప్పుడు కొడాలి నాని మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక మీడియా సమావేశం కూడా ఆయన ఇటీవల కాలంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు పదేపదే మీడియా ముందు కనపడే నాని ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు.
ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కూడా కొడాలి నాని సరైన సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వంపై ఆయన అసలు విమర్శలు చేయలేదు. దీనితో నానిలో భయం మొదలైందని, అందుకే ఆయన జాగ్రత్తగా ఉంటున్నారని కొంతమంది టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు మైకు దొరికితే చంద్రబాబు నాయుడుని, టిడిపిని విమర్శించే నాని విజయవాడలో మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఇక మీడియాకు వీలైనంత దూరం పాటించడానికి ఆయన ఆసక్తి చూపించారు. ఇక వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు తరలించే సమయంలో కూడా ఆయన వెళ్లి కలిసేందుకు ఆసక్తి చూపించలేదు. కనీసం వంశీకి మద్దతుగా పోలీస్ స్టేషన్ వద్దకు కూడా కొడాలి నాని వెళ్లలేదు.













