జగన్ ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి ఘాటు విమర్శలు..
ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జగన్ ప్రభుత్వం పై ఘాటుగా విమర్శలు కురిపించారు. కేంద్రం నుంచి రుణాలు తీసుకోకపోతే కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది అంటే దానికి కారణం ఎవరు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అరాచక పాలన నుంచి కాపాడడానికి.. ప్రగతివైపు నడిపించడానికి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడ్డాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నాడు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలికిరిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 తర్వాత తిరిగి 2024లో పోటీ చేయడానికి ముఖ్య కారణం పెరిగిపోతున్న అరాచకాన్ని చూడలేకపోవడమే అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓటర్లు చాలా తెలివైన వాళ్ళని.. వాళ్ల దగ్గర కాజేసిన డబ్బు వాళ్లకే ఇచ్చి మభ్య పెట్టాలి అనుకుంటే కుదరదని.. డబ్బుకు లొంగి భవిష్యత్తును తాకట్టు పెట్టే రోజులు పోయాయని ఆయన అన్నారు.













