సాగరతీరంలో క్రిమినల్స్..?
విశాఖ నేరరాజధానిగా మారుతోందా? సాక్షాత్తూ ఎంపీ కుటుంబాన్ని సింపుల్‌గా కిడ్నాప్ చేయడంతో… ప్రజాప్రతినిధులు, వీఐపీల వణికిపోతున్నారా? హోదా బట్టి పోలీసులు రక్షణ కల్పిస్తున్నప్పటికీ….. వ్యక్తిగత భద్రత కోరుకుంటున్నారా?లైసెన్స్ డ్ వెపన్స్ కోసం పెరుగుతున్న అప్లికేషన్స్ … దీనికి మరింత బలం చేకూరుస్తోంది.
సాగరతీరం ప్రస్తుతం నేరస్థులకు అడ్డాగా మారుతోంది. ఏకంగా MP కుటుంబాన్నే కిడ్నాప్ చేసే స్థాయికి ఎదిగారు ఇక్కడి క్రిమినల్స్. ఎంపీ కుమారుడు, భార్యతోపాటు ప్రముఖ ఆడిటర్‌ను ఇంట్లో బంధించి రెండురోజులు చిత్ర హింసలు పెట్టినా ఎవరూ కనిపెట్ట లేదు. విషయం తెలిసిన తర్వాత పోలీసులు వేగంగా స్పందించినా.. నగరంలో కొత్త భయాందోళనకు బీజం వేసింది కిడ్నాప్. ఆ రెండు రోజుల్లో జరగరానిది ఏదైనా జరిగితే.. ఈ ఊహే ప్రముఖుల బీపీ పెంచేస్తోంది. నేరస్తులు ఎందుకిలా పేట్రేగిపోతున్నారు అనే ప్రశ్న కంటే.. మనదాకా వస్తే… ఎంత వరకు భద్రం..? సెక్యూరిటీ జోన్లోనే ఉన్నా.. ఎంత సెక్యూర్‌గా ఉన్నాం అనేది వీఐపీలను నిద్ర లేకుండా చేస్తోంది.
రియల్ ఎస్టేట్ భూమ్‌తో వైజాగ్ ఎంతో విస్తరించింది. ఇక్కడున్న కేంద్ర సంస్థలు… ఉపాధి అవకాశాల వల్ల మినీ ఇండియాగా మారింది నగరం. ఈ స్పీడ్ డెవలప్మెంట్లో నేరగాళ్లు కూడా అంతేవేగంతో క్రైం చేస్తున్నారు. రౌడీషీటర్లకు .. గ్యాంగులు ఏర్పాటు చేసిన వారికి పోలీసులు కౌన్సెలింగ్‌లు, వార్నింగ్‌లు ఇస్తున్నా.. వాటిని లైట్ తీసుకుంటున్నారని.. ఎంపీ కుటుంబం కిడ్నాప్‌తో తేటతెల్లమైంది. ఈ ఘటనతో ప్రజాప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా.. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు అభద్రత ఫీలవుతున్నారు.
గతేడాది భీమిలికి చెందిన రియల్టర్‌ను హేమంత్ అనే రౌడీషీటర్ కిడ్నాప్ చేశాడు. కారుతో తిప్పుతూ కోటి డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మరో రియల్టర్‌ను ప్లాట్ అమ్ముతానని పిలిచి కిడ్నాప్ చేసి డబ్బు వసూలు చేశాడు. ఇప్పుడు ఏకంగా ఎంపీ కుటుంబం జోలికే రావడంతో.. ప్రజాప్రతినిధులు… వారి కుటుంబ సభ్యులు వణికిపోతున్నారు. కిడ్నాప్ తర్వాత గన్ లైసెన్స్ కోసం తన కుమారుడు తాను దరఖాస్తు చేసుకున్నట్టు ఎంపీ MVV సత్యనారాయణ తెలిపారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు తెరపైకి వచ్చింది. మూడేళ్ల క్రితం గన్ లైసెన్స్ కోసం నిర్ణయం తీసుకున్న అమర్నాథ్.. ఇటీవల తన అప్లికేషన్‌ను క్లియర్ చేయాలని పోలీస్ కమిషనరేట్ అధికారులను అభ్యర్థించారు. అమర్నాథ్ మినిస్టర్ కావడంతో రూల్స్ ప్రకారం పటిష్ట భద్రత ఉన్నప్పటికీ.. వ్యక్తిగత భద్రత పేరుతో గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చకు దారితీస్తోంది.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక హోదాలో ఉన్నందున వ్యక్తిగత భద్రత కోసం గన్ లైసెన్స్ అడుగుతున్నారు. మరి సామాన్యుల భద్రత సంగతి ఏంటి? మంత్రులు, ఎంపీలే గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడాన్ని ఎలా చూడాలి? సిటీలో శాంతి భద్రతలు దిగజారాయనే సంకేతాలు ఇస్తున్నారా? లేక పోలీసులు తమకు కల్పిస్తున్న సెక్యూరిటీ సరిపోదని భావిస్తున్నారా?













