పొలిట్‌బ్యూరోలోకి జూనియర్ ఎన్టీఆర్ ?
తెలుగుదేశం పార్టీలో యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్ క్రియాశీలకం కానున్నారా? పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్ బ్యూరోలో ఎన్టీఆర్‌కు చోటు దక్కనుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మాజీ ఎంపీ, మంత్రి నందమూరి హరికృష్ణ గతవారం నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. మరణించే నాటికి ఆయన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉండడంతో ఆ స్థానంలో నందమూరి కుటుంబానికి చెందిన వారే తీసుకోవాలన్న ప్రతిపాదనపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్లతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌ను ఎలాగైనా ఒప్పించి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.
2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కూడా నిర్వహించారు. ఆ ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. సినీ రంగంలో పటిష్టమైన స్థానం సంపాదించాలనే ఉద్దేశంతో తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో ఎన్టీఆర్ తెలిపారు. ఏపీ మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన పార్టీ సీనియర్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది. హరికృష్ణ హఠాన్మరణంతో మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయానని తెలిపారు.
ఇదే సందర్భంలో పొలిట్‌బ్యూరోలో హరికృష్ణ స్థానంలో ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అంశంపై ఆయన సీనియర్లతో అభిప్రాయాలు పంచుకున్నట్టు సమచారం. చాలామంది సీనియర్లు హరికృష్ణ కుటుంబం నుంచే పొలిట్‌బ్యూరో సభ్యులుగా తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. సినీ రంగానికి చెందిన యువ నటుడు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో పార్టీ స్థాపించి విస్తృతంగా ప్రజల్లోకి వెళుతూ ప్రభుత్వ చర్యలను తీసుకుంటున్న విధానాలను తూర్పారపడుతున్నారు. ఆయనకు కౌంటర్‌గా ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హరికృష్ణ సోదరుడు, చంద్రబాబు బావమరిది బాలకృష్ణ హిందూపురం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు కాదని ఎన్టీఆర్‌ను పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంటే ఎటువంటి సాంకేతాలు వెలువడతాయోనన్న అంశంపై టీడీపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు సమచారం. మంత్రివర్గ విస్తరణ తర్వాత మరోసారి పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి హరికృష్ణ స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై చంద్రబాబు చర్చించి నిర్ణయం తీసుకుంటారని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.













