విశాఖ టీడీపీ ఆఫీస్‌లో కూటమి నేతల కీలక భేటీ..!
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) ఎన్నికల రణరంగానికి అధికార కూటమి శ్రేణులు సమరశంఖం పూరించాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ కార్పొరేషన్‌పై పసుపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కూటమి పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని టీడీపీ నగర కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన(Janasena), బీజేపీ పార్టీల ముఖ్య నాయకుల అత్యంత కీలకమైన సమన్వయ సమావేశం జరిగింది.
ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రి డోలా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కూటమి కీలక నేతలు డోలా బాల వీరేంద్ర స్వామి, షరీఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో మూడు పార్టీలు ఏ విధంగా కలిసికట్టుగా ముందుకు సాగాలి, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థుల క్లీన్ స్వీప్ విజయమే లక్ష్యంగా ఈ సమావేశంలో ఒక ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేశారు.
మూడు పార్టీల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు రాకుండా, గెలుపు గుర్రాలకే సీట్ల సర్దుబాటు జరిగేలా సీనియర్ నేతలు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాల పునఃపరిశీలన, స్థానిక సమస్యలపై పోరాటం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై మంత్రి పల్లా శ్రీనివాసరావు క్యాడర్‌కు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చారు. గత మున్సిపల్ ఎన్నికల నాటి పరిస్థితులకు, ఇప్పటి రాజకీయ సమీకరణాలకు చాలా వ్యత్యాసం ఉందని.. కూటమి ఏర్పడిన తర్వాత ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను ఓట్లుగా మార్చుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేసి వార్డుల వారీగా పట్టు సాధించాలని, అప్పుడే జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకోవడం నల్లేరుపై నడకే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంతో విశాఖపట్నంలో మున్సిపల్ ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది.








