Amaravati : ఏపీ రాజధాని అమరావతి .. కేబినెట్ తీర్మానం
పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి (Amaravati) పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం (Cabinet meeting) లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. ఈ భేటీల అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కి క్యాబినెట్ ధన్యవాదాలు తెలిపింది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది. తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది.
ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు క్యాబినెట్ అభినందనలు తెలిపింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor )అనే పేరు బాగుందని, దేశ ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఈ పేరు ఉందని క్యాబినెట్ అభిప్రాయపడిరది. ఇదే తరహాలో రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాలకు మంచి పేర్లు పెట్టేలా దృష్టి పెట్టాలని నిర్ణయించింది. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. విశాఖ, మచిలీపట్నం, నాగాయలంకలలో వంటి ప్రదేశాల్లో భద్రత, కార్యాచరణపై మంత్రులతో సీం సుదీర్ఘంగా చర్చించారు. తీర ప్రాంతాల్లో భద్రతకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం పెంపు, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. మున్సిపల్ శాఖ 281 పనులను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో ఆమోదించి కేంద్రం వద్ద పెండిరగ్లో ఉన్న 3 చట్టసవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని క్యాబినెట్లో నిర్ణయించారు.













