వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఆధారం…
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. కడప జిల్లా పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని, అతని కుటుంబసభ్యులను గత నాలుగు రోజుల నుంచి విచారిస్తున్న సీబీఐ అధికారులు ఇవాళ కూడా కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో మరోసారి ప్రశ్నిస్తున్నారు. పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహించే వ్యక్తికి ఆంధప్రగతి గ్రామీణ బ్యాంకు లాకర్లో రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారం ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
చెప్పుల దుకాణం యజమానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఆయనతో సంబంధం ఉన్న మరికొందరు యువకులను కూడా సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. కడపలోనే కాకుండా పులివెందులలో కూడా సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో ఓ బృందం చెప్పుల దుకాణం యజమాని స్నేహితులు, సన్నిహితులను విచారిస్తున్నట్లు సమాచారం.













