మా రాజీనామాకి చంద్రబాబే కారణం : కేశినేని శ్వేత
తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని కలలో కూడా ఊహించలేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత అన్నారు. కార్పొరేటర్ పదవికి శ్వేత రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను నగర మేయర్‌కు అందజేశారు. రాజీనామా ఆమోదం తర్వాత టీడీపీని వీడనున్నట్లు తెలిపారు. అనంతరం శ్వేత మీడియాతో మాట్లాడుతూ పార్టీని వీడాల్సి వస్తుందని నేను, ఎంపీ కేశినేని నాని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే పార్టీ అధినేత చంద్రబాబుపై మాకున్న అభిమానం, ప్రేమ అలాంటిది. కానీ ఈ రోజు పార్టీయే మమ్మల్ని కాదనుకుంటోంది. అధినేతనే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఒక సిట్టింగ్ ఎంపీ అయిన కేశినేని నానికి, విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని సమాచారం వచ్చింది. ఇంత జరిగిన తర్వాత పార్టీలో ఉండడం సరైంది కాదని మేం భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం ఎవరినీ తప్పుబట్టడం లేదు. పార్టీ కోసం అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అని అన్నారు.













