ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదే : కేశినేని
వాలంటీర్ల వ్యవస్థ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎంపీ కేశినేని నాని రైతులకు రాయితీపై రెండో దశలో 25 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి చేసే ఏ వ్యవస్థనైనా ప్రోత్సహించి కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. అధికార పార్టీ కోసం పనిచేయని వాలంటీర్లతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలని, అన్నదాతలు బాగుండాలనేది టీడీపీ ఆకాంక్షగా అని పేర్కొన్నారు. గతంలో రాయితీపై చంద్రబాబు రైతులకు ట్రాక్టర్లు అందించారని, టీడీపీ అధికారంలో లేకపోవడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతోనే రాయితీపై 1000 ట్రాక్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.













