ఆ టైమ్ కోసం కేశినేని నాని వెయిట్ చేస్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అందులోనూ విజయవాడ పాలిటిక్స్ సంచలనం సృష్టిస్తూనే ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బెజవాడ నేతలు మాత్రం తమదైన శైలిలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా అలాగే వార్తల్లో ఉంటున్నారు. ముక్కుసూటి తనం ఆయన్ను ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా మారుస్తుంటుంది. కొన్నిసార్లు సమస్యలు కూడా తెచ్చిపెడుతుంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. టీడీపీ ఎంపీగా ఉన్న ఆయన … వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది అంతు చిక్కడం లేదు. సరైన సమయం కోసం కేశినేని నాని వెయిట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
2019 ఎన్నికల్లో టీడీపీ మూడు ఎంపీ స్థానాలను మాత్రమే దక్కించుకుంది. గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. వరుసగా రెండు సార్లు గెలిచి సత్తా చాటారాయన. అంతేకాదు.. తన వ్యాపారాల వల్ల రాజకీయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని భావించి.. బిజినెస్ నే పూర్తిగా మూసేశారాయన. టీడీపీలో ఆయనకు నిన్నమొన్నటి వరకూ మంచి ప్రాధాన్యమే దక్కింది. కానీ ఏమైందో ఏమో ఆయన రోజురోజుకూ పార్టీకి దూరమవుతున్నారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర విజయవాడ మీదుగా సాగింది. కానీ కేశినేని నాని ఆయన పాదయాత్రకు దూరంగా ఉండిపోయారు. పార్టీ కూడా ఆయన్ను పిలవలేదు.. పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ మాత్రం చంద్రబాబు వెంట అన్నీ తానై వ్యవహరించారు కేశినేని నాని. దీంతో నాని తీరు ఎవరికీ అర్థం కాలేదు. లోకేశ్ కు దూరంగా ఉండడం.. చంద్రబాబుకు దగ్గరగా మెలగడం.. అసలు నాని అంతరంగమేంటో అంతు చిక్కడం లేదు.
తాజాగా.. తాను మళ్లీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని.. తన అనుచరుడు ఎంఎస్ బేగ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారని ప్రకటించారు కేశినేని నాని. వాస్తవానికి టీడీపీలో ఇలాంటి సంస్కృతి లేదు. సీట్లు చంద్రబాబు తప్ప ఎవరూ అనౌన్స్ చేయరు. కానీ కేశినేని నాని మాత్రం తనకు తిరుగే లేదన్నట్టు.. తానే అధినేతను అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ నాని మాత్రం అక్కడ తన ఫ్రెండ్ బేగ్ పోటీ చేస్తారని చెప్పేశారు. ఈ వ్యవహారాన్నంతటినీ టీడీపీ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. నానిని ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని భావిస్తోంది. అయినా చర్యలు తీసుకునేందుకు మాత్రం అధిష్టానం సాహసించడం లేదు. పార్టీ నుంచి బహిష్కరించేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటోంది. కానీ నాని మాత్రం తనపై వేటు వేస్తేనే మంచిదనే ఫీలింగుతో ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.













