కేశినేని నాని దారెటు..? చివరకు ఇండిపెండెంట్‌గానే మిగులుతారా..?
తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని తదుపరి ప్రస్థానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన్ను పక్కకు తప్పించడంతో నాని అడుగులు ఎటువైపు ఉంటాయోనని ఆయన సన్నిహితులు ఆరా తీస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఎంపీగా నెగ్గిన కేశినేని నాని మూడోసారి కూడా తానే గెలుస్తానని ధీమాగా చెప్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా తనదే విజయమంటున్నారు. అయితే టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించిన ఆయన వైసీపీలో చేరతారా.. లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
కేశినేని నాని మొదట ప్రజారాజ్యంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే అందులో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. వెంటనే టీడీపీలో చేరారు. అనంతరం 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయినా కేశినేని నాని మాత్రం విజయవాడ నుంచి రెండోసారి గెలిచారు. వైసీపీ ప్రభంజనం సాగిన 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. విజయవాడ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీల్లో ఒక్క చోట మాత్రమే టీడీపీ నెగ్గింది. అయినా కేశినేని నాని మాత్రం గెలవగలిగారంటే ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఎంపీగా ఉన్నా కేశినేని ముక్కుసూటితనం పార్టీలో పలు ఇబ్బందులకు కారణమైంది. పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ లపై నాని పలుమార్లు నోరు జారారు. అదే సమయంలో నాని స్వభావం నచ్చని కొంతమంది స్థానిక నేతలు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపారు. నాని సొంత తమ్ముడు చిన్ని ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా కేశినేని పాల్గొనలేదు. పైగా వైసీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనడం టీడీపీ అధిష్టానానికి ఇబ్బంది కలిగించింది. నాని పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని.. త్వరలోనే వైసీపీలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా జోరుగా వినిపిస్తోంది.
తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా సమావేశానికి సన్నాహక ఏర్పాట్లకోసం వెళ్లి నాని అనుచరులకు ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కేశినేని నానికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వట్లేదని చంద్రబాబు పార్టీ పెద్దల ద్వారా చెప్పించారు. దీంతో కేశినేని నాని పార్టీతో పాటు పదవికీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. వాస్తవానికి మైలవరం ఎమ్మెల్యే సీటును శ్వేతకు, విజయవాడ పార్లమెంటును తనకు ఇవ్వాలని కేశినేని నాని కోరారు. కానీ ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచే బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పార్టీని వీడుతున్న సమయంలో ఆయన తన తదుపరి ప్రస్థానంపై ఏమీ మాట్లాడలేదు. త్వరలోనే అన్ని విషయాలు చెప్తానన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నందున జనసేనలో నాని చేరే అవకాశం లేదు. కాబట్టి ఆయన ముందున్న ఏకైక ఆప్షన్ వైసీపీ. కేశినేని నాని రాకను వైసీపీలో చాలా మంది స్వాగతిస్తున్నా కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. పైగా వైసీపీలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ సమయంలో వైసీపీలో చేరినా సీటు దక్కుతుందా.. లేదా అనే అనుమానాలున్నాయి. అయితే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలుస్తానని నాని చెప్పడంతో ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తారా.. అనే సందేహాలున్నాయి. అయితే ఏదైనా పార్టీ అండ లేకుండా పోటీ చేసి గెలవడం ఇప్పట్లో అసాధ్యమనే చెప్పొచ్చు.













