రాజధానిని తరలించే హక్కు ఎవరికీ లేదు
రాజధాని తరలింపు మీ తాత, ముత్తాతల వల్ల కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని తరలించే హక్కు ఎవరికీ లేదన్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అని మాయ మాటలు చెబితే.. నమ్మి ఓట్లేశారన్నారు. ప్రజావేదిక కూల్చి అశుభంతో జగన్ పాలన ప్రారంభించారని అన్నారు. చంద్రబాబు కట్టాడనే ప్రజావేదికను కూల్చాడని ఆయన ఆరోపణలు చేశారు. జగన్‌ను గెలిపించి కష్టాలు తెచ్చుకోవడం మనం చేసిన తప్పు అని అన్నారు. అమరావతిని అభివృద్ది చేయడం చేతకాక పోతే రాజీనామా చేయండి. తప్పుచేస్తే ఇక్కడి మహిళలు చీపురుకట్టలతో తరమి కొడతారు. ఆదాయ మార్గాలే తప్ప విశాఖపై జగన్‌కు ప్రేమ లేదన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళితే డిపాజిట్లు రాకుండా తరమి కొడతారు. 151 మంది ఎమ్మెల్యేలని ఇచ్చినా జగన్‌కు పాలన చేతకాలేదు. మీకు 22 మంది ఎంపీలు ఉన్నా మేం ముగ్గురం చాలు. కులం, మతం జోలికి వెళ్లి రెచ్చగొట్టవద్దు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.













