కేశినేని నాని చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. పార్టీతో అంటీముట్టనట్టు ఉండడం, సొంతపార్టీ నేతలపైనే విమర్శలు చేస్తుండడం, అధికార పార్టీ నేతలు ఈయన్ను పొగుడుతుండడం.. లాంటి సీన్లు ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీని వదిలేసి కేశినేని నాని వైసీపీలో చేరడం ఖాయమని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాని కూడా తనకు సీటిస్తే పోటీ చేస్తానని.. లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్తున్నారు. కానీ అంతలోనే ఆయన చంద్రబాబు పక్కన కనిపిస్తారు. దీంతో అసలేం జరుగుతోందో అంతుచిక్కడం లేదు.
గత ఎన్నికల్లో టీడీపీ 3 ఎంపీ స్థానాల్లో గెలిస్తే అందులో కేశినాని నాని ఒకరు. విజయవాడ నుంచి ఆయన గెలుపొందారు. విజయవాడ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేయకుండా ఎంపీగా కేశినేని నానికి మాత్రం ఓటేశారు. ఇది కచ్చితంగా నాని సొంత ఓటు బ్యాంకుగానే చెప్పుకోవాలి. నాని స్వతహాగా సేవ చేస్తుంటారు. తన ట్రస్టు ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారు. ఈయనకు టాటా ట్రస్ట్ కూడా తోడవ్వడంతో సేవ మరింత విస్తృత పరిచారు. దీంతో నానికి జిల్లా వ్యాప్తంగా సొంత ఇమేజ్ ఉంది. ఈసారి కూడా తన వ్యక్తిగత ఇమేజ్ తోనే గెలుస్తాననే ధీమా ఆయనకు ఉంది.
తెలుగుదేశం పార్టీలో కేశినేని నానికి ఈ మధ్య తగిన ప్రాధాన్యత లేదు. జిల్లా నేతలంతా ఏకమై నానిని ఏకాకిని చేశారు. అధిష్టానం కూడా నాని వైపు కాకుండా మిగిలిన వాళ్లకే అండగా ఉంటోంది. దీంతో నాని జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా తన పని తాను చేసుకుపోతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. పైగా అధికార పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో దర్శనమిస్తున్నారు. వైసీపీ నేతలు ఈయన్ను పొగుడుతున్నారు. ఈయన కూడా వాళ్లను పల్లెత్తు మాట అనకపోగా సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు.
తాను జీవితకాలం రాజకీయ నేతగా ఉండలనుకోవడం లేదన్నారు కేశినేని నాని. తనకు పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని.. లేకుంటే ఇండిపెండెంట్ గా పోటి చేస్తానని చెప్పారు. కొంతమంది గొట్టంగాళ్ల కోసం పార్లమెంటులో పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన మహానాడుకు తనకు ఆహ్వానం లేదన్నారు నాని. మరి చంద్రబాబు పక్కన ఢిల్లీలో కనిపించారు కదా… అని ప్రశ్నించినప్పుడు చంద్రబాబు పీఏ ఫోన్ చేసి ఢిల్లీ రావాలని కోరారని, అందుకే వెళ్లానని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇటీవల కేశినేని నాని కామెంట్స్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే కేశినేని నానికి వైసీపీ నుంచి చాలాకాలం కిందటే ఆహ్వానం ఉంది. ఆయన వైసీపీలో చేరాలనుకుంటే ఎప్పుడో చేరిపోయి ఉండొచ్చు. ఆయన్ను ఆపేవాళ్లెవరూ ఉండరు. కానీ ఆయన ఆ పని చేయట్లేదు. టీడీపీలోనే ఉంటున్నారు. పార్టీ తనను పట్టించుకోవట్లేదని చెప్తున్నా.. పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. దీని వెనుక ఓ వ్యూహముంది. తనకు వచ్చే ఎన్నికల్లో రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం కావాలని కేశినేని నాని కోరుకుంటున్నారు. కుమార్తెను ఈసారి ఎమ్మెల్యే బరిలో నిలపాలనుకుంటున్నారు. మైలవరం, విజయవాడ వెస్ట్ సహా విజయవాడ పార్లమెంట్ స్థానం ఎవరిస్తే ఆ పార్టీలో కేశినేని నాని ఉంటారు. వైసీపీలో ఈయన డిమాండ్లు నెరవేరకపోవచ్చు. అందుకే టీడీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు నాని మాటలన్ని చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేయడానికేనని.. ఆయన పార్టీని వదిలి ఎక్కడికీ పోరని కొందరు అభిప్రాయపడుతున్నారు.













