Kesineni Brothers: రాజ్ కసిరెడ్డితో కేశినేని చిన్నికి సంబంధాలు..! బాంబ్ పేల్చిన కేశినేని నాని..!!

కేశినేని బ్రదర్స్ (Kesineni Brothers) మధ్య యుద్ధం కొనసాగుతోంది. మరోసారి కేశినేని చిన్ని (Kesineni Chinni) టార్గెట్ గా నాని ట్వీట్ చేశారు. దీంతో చిన్ని కూడా రిప్లై ఇచ్చారు. ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజ్ తో చిన్నికి వ్యాపార సంబంధాలున్నాయంటూ నాని (Kesineni Nani) చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన చంద్రబాబును (CM Chandrababu) కోరారు. అయితే రాజ్ కసిరెడ్డితో (Raj Kasireddy) తన వ్యాపార సంబంధాలపై కేశినేని చిన్ని క్లారిటీ ఇచ్చారు.
సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కాంలో అరెస్టయిన రాజ్ కసిరెడ్డి, పైలా దిలీప్ తో ఎంపీ కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని ఆరోపించారు. రాజ్ కసిరెడ్డి, ఎంపీ చిన్ని కలిసి Pryde Infracon LLP సంస్థలో భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాక.. రాజ్ కసిరెడ్డి, దిలీప్ కలిసి Eshanvi Infra Projectes Pvt Ltd నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ రెండు సంస్థల అడ్రస్ లు ఒకటే అన్న విషయాన్ని నాని ఎత్తి చూపారు. పైగా రెండు సంస్థలు ఒకే ఈమెయిల్ వాడుతున్న విషయాన్ని నాని లేవనెత్తారు. వీటి ద్వారా కుంభకోణాల సొమ్మును విదేశాలకు తరలించే అవకాశం ఉందని.. వీటిపై స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సీఎం చంద్రబాబుకు సూచించారు.
అయితే కేశినేని నాని ఆరోపణలను కేశినేని చిన్ని ఖండించారు. నాని ఆరోపణలపై చిన్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వాస్తవానికి కేశినేని నాని నీతిమాలిన ఆరోపణలకు స్పందించేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రజా ప్రతినిధిగా ప్రజలకు, పార్టీ క్యాడర్ కు స్పష్టత ఇవ్వడం కోసం స్పందిస్తున్నానన్నారు. వెన్నుపోటు దారుడు, నయవంచకుడు, నమ్మక ద్రోహీ, జగన్ రెడ్డికి గూఢచారిగా పని చేసిన వ్యక్తి కేశినేని నాని అని మండిపడ్డారు. ఇప్పుడు పనిగట్టుకుని చేసే పనికిమాలిన, పసలేని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు మా సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉన్నందున సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి 2021లో ఆ సంస్థను రిజిస్టర్ చేసినట్లు చిన్ని వివరించారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లో అందరికి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కసిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా అప్పుడే నిర్ణయం తీసుకున్నానని చిన్ని వివరించారు. తద్వారా ఆర్థికంగా నష్టపోయానని వివరించారు. ఇక అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత.. నాపై ఆరోపణలు చేసిన వారిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. నానికి సత్తావుంటే నాకు, కసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలను నిరూపించాలని సవాల్ చేశారు.
ఇదివరకు కూడా నాని, చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత నెలలో చిన్ని కార్యాలయం నుంచి ఎన్టీఆర్ పేరు తొలగించి, క్రిమినల్ శోభరాజ్ పేరు పెట్టాలని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇసుక, గ్రావెల్ వ్యాపారం, భూ దందాలు, పేకాట గృహాల నిర్వహణలో చిన్ని ఉన్నాడని ఆరోపించారు. ఉర్సా క్లస్టర్స్ భూకేటాయింపుల వెనుక చిన్ని ఉన్నాడని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. చిన్ని ఈ ఆరోపణలపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇక తాజా వివాదం వీళ్లిద్దరి మధ్య మరోసారి రచ్చ రాజేసింది. అయితే రాజ్ కసిరెడ్డితో చిన్నికి సంబంధాలున్నాయనే విషయంపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.