కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోం
రాష్ట్రాన్ని ముక్కులు చేసిన కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మపోరాట దీక్ష విజయవంతమైందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు సాధ్యపడదని, తాను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామన్నారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు ఉందన్నారు. రాష్ట్రంలో, ముఖ్యంగా జిల్లాలో జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి రాదని, రాబోదని తెలిపారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చన్నారు. ఒకాయన ఒట్టి మాటలు చెబుతూ ఊహకందని హామీలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మోదీ మెడ వంచైనా ఏపీకి హోదా, విభజన చట్టంలో హామీలను సాధిస్తామని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు.













