దీపాలు వెలిగించిన ముఖ్యమంత్రులు
తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 నుంచి 9 నిముషాలపాటు దీపాలను వెలిగించారు. కరోనాపై పోరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దీపాలు వెలిగించారు. సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ బల్బులను ఆర్పి కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం ప్రకటించారు. ప్రగతిభవన్లో మంత్రి ఈటెల రాజేందర్, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు కూడా కొవ్వొత్తులు వెలిగించారు. మరోవైపు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబసభ్యులతో కలిసి కొవ్వొత్తి వెలిగించారు. కరోనాపై దేశం సమిష్టిగా చేస్తున్న యుద్ధానికి సంఘీభావంగా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. దీనిలో భాగంగానే మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవ్వొత్తిని వెలిగించి తన మద్దతు ప్రకటించారు. ఆంధప్రదేశ్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్లు కొవ్వొత్తితో కరోనాపై పోరాటానికి తన వంతుగా సంఘీభావం తెలిపారు.













