Kasireddy: ఏపీలో లిక్కర్ స్కాం కలకలం: కనిపించని కసిరెడ్డి జాడ..
ఏపీలో లిక్కర్ స్కాం (AP liquor scam) రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా భావించబడుతున్న వైసీపీ (YCP) నేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kassireddy Rajasekhar Reddy) ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నదే ప్రశ్నగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ (SIT) విచారణకు ఆయన హాజరుకాలేదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రాజశేఖర్ రెడ్డి విచారణకు రావడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరికీ అందుబాటులో లేరని సమాచారం. దీంతో స్కాంలో కీలకమైన వివరాలు వెలుగు చూడటానికి సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
ఈ లిక్కర్ స్కాంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవహారంలో ముఖ్య బాధ్యత రాజశేఖర్ రెడ్డిదేనని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy ) ఆరోపించారు. ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో ఈ కేసులో రాజశేఖర్ పాత్రపై ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆయన ఎక్కడిపోయారు? ఎందుకు విచారణకు హాజరు కావడం లేదు? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు.
వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి లిక్కర్ వ్యాపారం మీద పూర్తి నియంత్రణ వహించేవారని, ప్రతి నెల కోట్ల రూపాయల కమీషన్లు వసూలు చేశారని సిట్ ఆధారాలు చెప్పుతున్నాయి. ఒక పెద్ద నేతతో కలిసి దాదాపు రూ.3 వేల కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే కారణంగా ఆయనపై నోటీసులు జారీ చేయగా, మొదటి రెండు సార్లు ఆయన స్పందించలేదు. చివరికి ఈమెయిల్ ద్వారా తనకు లిక్కర్ స్కాంలో సంబంధం లేదని చెప్పినా, సిట్ మాత్రం ప్రత్యక్షంగా విచారణకు రావాలని కోరింది.
ఈ నేపథ్యంలో కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. సిట్ మూడోసారి నోటీసులు పంపగా, అప్పటికీ ఆయన హాజరుకాలేదు. అందులోనూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కనిపించకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం సిట్ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు వేరే మార్గాలు అన్వేషిస్తోంది. రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు మరింత రాజకీయ ఉత్కంఠ రేపేలా మారుతోంది. ఇప్పటికే వైసీపీలోని కొన్ని కీలక నేతలపై సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉండగా, సిట్ తదుపరి చర్యలు ఏవైనా సంచలనాలు కలిగించే అవకాశముంది.













