ముద్రగడ హౌస్ అరెస్ట్
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపులను బీసీల్లో చేర్చాలంటూ కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర చేసేందుకు ముద్రగడ సిద్ధమయ్యారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో ముద్రగడను 24 గంటల పాటు గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోలేదని, దీంతో ఆయన్ని సెక్షన్ 151 పీఆర్సీసీ కింద నిర్బందించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను ముద్రగడకు వివరించగా ఆయన గృహానికే పరిమితమయ్యేందకు ఒప్పుకున్నారని వెల్లడించారు. దీంతో చేసేదేమీ లేక, ముద్రగడ ఇంటిలోకి వెళ్లిపోగా, ఇంటి ముందు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ముద్రగడ ఇంటిలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ముద్రగడకు మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి కాపు నేతలు, యువకులు పెద్దయెత్తున కిర్లంపూడికి తరలివస్తున్నారు. పోలీసులు వారందరినీ పట్టణ శివారులోనే అడ్డుకుని తిరిగి పంపించి వేస్తున్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు కిర్లంపూడికి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు.













