అధికారంలోకి రావాలంటే.. ఆయనపై ఎవరి ప్రభావం ఉండొద్దు
జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కే వదిలేయాలని, ఆయనపై ఎవ్వరు ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నేత కన్నా లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బయటనుంచి జనసేనను ఎవ్వరు ప్రభావితం చేయకుండా ఉంటే జనసేన అధికారంలోకి రావటం ఖాయం అంటూ పరోక్షంగా బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. అదే సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్పై విమర్శలు చేశారు. జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానం చేయించుకుంటున్నారు? అని ప్రశ్నించారు. పార్లమెంట్లో జీవీఎల్ అడిగిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో కొడితే అర్థమైపోతుంది అంటూ సెటైర్లు వేశారు. వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా చేసిన కన్నా వైఎస్ఆర్ హయాంలోనే కాపు రిజర్వేషన్ల అంశంపై తెరపైకి వచ్చిందని తెలిపారు. కానీ అప్పుడు అది సాధ్యం కాలేదని ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఈడీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకుని కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు పూర్తి చేశారని అన్నారు.













