పరిపాలన అంతా అమరావతి నుంచే : కన్నా
విశాఖలో భూదందా కోసమే అమరావతి నుంచి రాజధానిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని బూచిగా చూపిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధిని పక్కనపెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖలో ఆరువేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో కేంద్రం నిర్ణయించదన్నారు. రాజధాని అంశంపై మొదటి నుంచి ఒకటే వైఖరితో ఉన్నామని అన్నారు. పరిపాలన అంతా అమరావతి నుంచే జరగాలని కోరుతున్నామని సృష్టం చేశారు.













