వైసీపీ నేతలు కూడా అదే దారిలో : కన్నా
అమరావతి రాజధానిని అందరూ ఆహ్వానించారని, జగన్ కూడా అమరావతిని ఆహ్వానించినట్టు గుర్తని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. రాజధాని ప్రాంతంలో బీజేపీ నేతల బృందం పర్యటించిది. రైతులతో మాట్లాడిన అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ మాట తప్పం, మడమ తిప్పం అన్న నేతలు.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్ను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పటడుగులు వేస్తోందని, ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, సీఎం నుంచి స్పందన రాలేదని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఆత్రం తప్ప, పని కన్పించడం లేదన్నారు.
ప్రభుత్వంలో ఉన్నామని మరిచిపోయి.. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవినీతి అంటూ వైసీపీ నేతలు కూడా అదే దారిలో పయనిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు పట్టిన గతే వైసీపీకి పడుతుందని హెచ్చరించారు. అవినీతిని నిరూపించేందుకు ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాజధానిని మార్చుతామంటే బీజేపీ ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. రాజధాని విషయంలో ఏం చేయబోతున్నారో జగన్ చెప్పాలని ఆయన నిలదీశారు. జగన్ ఆత్రం పక్కనపెట్టి, పాలనపై దృష్టిపెట్టాలని సూచించారు. రైతుల్లో నెలకొన్న భయాందోళనను సీఎం జగన్ పొగొట్టాలని అన్నారు.













