ఫ్యాన్ కిందకు కన్నా…?
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు బలోపేతం కావడం అనేది దాదాపుగా సాధ్యం కాదు. దీంతో ఆ పార్టీ నేతలు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. తమకు ఎంతో కొంత రాజకీయ భవిష్యత్తు ఉందని భావించిన కొంతమంది నేతలు వేరే పార్టీ లోకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని కొంత మంది భావించారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది మాజీ మంత్రులతో ఆయన వ్యక్తిగతంగా పరిచయం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు… మంత్రులు అయిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణకు చాలావరకు సహకారం అందించారు. ఇక ఆయన అండ చూసుకుని కొంతమంది అప్పట్లో వ్యాపారాలు చేసుకునేవారు అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఇప్పుడు వాళ్ళు ఆయనను పార్టీలోకి తీసుకురావడానికి కాస్త తీవ్రంగానే కష్టపడుతున్నారని తెలిసింది.
అయితే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ మున్సిపల్ ఎన్నికల తర్వాత తన ఆలోచన మార్చుకున్నట్టు గా సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో మాత్రమే గెలవడంతో కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఏ పార్టీలో కి వెళ్ళాలి అనే దానిపై కాస్త చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ లోకి వెళ్ళడానికి ఆయన కష్టపడుతున్నారట. గుంటూరు జిల్లాలో ఒక రాజ్యసభ ఎంపీ ద్వారా ఆయన వైసీపీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కన్నా లక్ష్మీనారాయణ విషయంలో సానుకూలంగా ఉన్నారని టాక్.
ఆయనకు రాజకీయ అనుభవం ఎక్కువగా ఉండటం గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఎక్కువగా ఉండటంతో తీసుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ కూడా ఉన్నారని సమాచారం. అవసరం అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా కూడా తీసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ భవిష్యత్తు లేకపోవడం… ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వంటివి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ తరుణంలో బిజెపి బలోపేతం కావడం అనేది ఎంతమాత్రం కూడా సాధ్యం అయ్యేపని కాదు. అందుకే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ వేరే పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఆయన ఎప్పుడు పార్టీ మారతారో చూడాలి.













