పార్లమెంట్ సాక్షిగా ఏపీ పరువు తీశారు
పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని టీడీపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కనకమేడల మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని, జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉందని చెప్పి రాష్ట్ర ఖ్యాతిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది, మేము జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ వైసీపీ ఎంపీ భరత్ లోక్సభలో చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఏపీలో ఆర్థిక దుస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు వల్లే ఈ ఆర్థిక పరిస్థితి అని సభను తప్పుదారి పట్టించారన్నారు. 63 ఏళ్లలో రాష్ట్రానికి రూ.3 లక్షల 14 వేల కోట్ల అప్పు మాత్రమే ఉందని, జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.3 లక్షల 8 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.













