ప్రత్యేక హోదా కోసం దుర్గమ్మకు బోనాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగు మహిళ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత ఆధ్వర్యంలో మహిళలు ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు నెత్తిన పెట్టుకుని ఘాట్ రోడ్డు మార్గంలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆశీస్సులు కోరారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రధాని మోడీ కుయుక్తుల్ని జనం గమనిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీకి బుద్ధి చెబుతారని సునీత విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, సభ్యులు పాల్గొన్నారు.













