Kakani Govardhan: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌కు.. 14 రోజుల రిమాండ్
అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి (Kakani Govardhan) కి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాకాణిని ఆదివారం బెంగళూరు (Bangalore) లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భారీ పోలీసు బందోబస్తు మధ్య జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ నుంచి సోమవారం ఆయనను కోర్టుకు తరలించారు. తొమ్మిది పోలీసు వాహనాల్లో, ప్రత్యేక పోలీసు బలగాలు మధ్య వెంకటగిరి (Venkatagiri)కి తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైలు (Nellore Central Jail) కు తరలించారు. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం తదితర అభియోగాలపై శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్ (Podalakur Police Station ) లో నమోదైన కేసులో కాకాణి నాలుగో నిందితుడి(ఏ4) ఉన్నారు.













