చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రాహువు, కేతువుల్లా దాపురించారు.. ఏపీ మంత్రి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ సెటైర్లు పేల్చారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నారా లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన ఖర్మ అని ఎద్దేవా చేసిన గోవర్దన్.. జసేనాని పవన్ కల్యాణ్ బుడబుక్కల వేషాలు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా రాష్ట్రానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరో రాహువు, కేతువుల్లా దాపురించారని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువు విలయతాండవం చేసిందని, పచ్చని పంట పొలాలు బీటలు బారాయని విమర్శించారు. రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలు ఎడారులను తలపించేలా ఎందుకు పోయాయని, జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిశాయని అన్నారు. జగన్ పాలనలోనే క్రమం తప్పని వర్షాలు కురిసి తాగు నీటి, సాగు నీటికి ఎటువంటి సమస్య రాలేదని చెప్పుకొచ్చారు. ఇదంతా కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా పచ్చ మీడియా మాత్రం తప్పుడు వార్తలు రాస్తూ అబద్దపు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. అనంతరం రామోజీరావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు వంటి వ్యక్తి దిగజారి అసత్య ప్రచారం చేయడం దారుణమని విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతన్నలకు ఎన్నటికీ అండగా నిలుస్తుందని, రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపిస్తామని అన్నారు.













