అమెరికాలో జరిగే ఆర్చరీ చాంపియన్‌షిప్‌కు ఏపీ అమ్మాయి
వచ్చే నెలలో అమెరికాలో జరిగే ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత కాంపౌండ్ జట్టులోకి ఆంధప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఎంపికైంది. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం పాటియాలాలో రెండు రోజుల పాటు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పెట్రోలియం స్పోర్టస్ ప్రమోషన్ బోర్డు (పీఏఎస్పీబీ) తరపున మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్‌లో రౌండ్లో బరిలోకి దిగిన సురేఖ 360 పాయింట్లకు గాను 357 పాయింట్లు స్కోరు చేసింది. ఈ క్రమంలో 356 పాయింట్లతో గతంలో తన పేరిట ఉన్న జాతీయ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. మహిళల విభాగంలో జ్యోతి సురేఖతోపాటు ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్ జట్టులోకి ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, సంగమ్ ప్రీత్ సింగ్ బిస్లా, రిషబ్ యాదవ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.













