ఆన్లైన్ క్లాసుల నిర్వహణలో అప్రమత్తత అవసరం:
చిన్నారుల విద్య కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహించాల్సి వస్తే అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ అభిప్రాయపడింది. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించే అవకాశాలను మరియు ప్రారంభిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సి వస్తే తలెత్తే ఇబ్బందుల గురించి రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ శనివారం కూలంకషంగా చర్చించింది. చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కోవిడ్ నేపథ్యంలో పాఠశాల, జూనియర్ కళాశాలల నిర్వహణ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. నిపుణులు పలు సూచనలు చేశారు. ఇందులో..
* ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సి వస్తే ఐదవ తరగతి లోపు పిల్లలకు అతి తక్కువ సమయాన్ని కేటాయించాలి.
* ఐదవ తరగతి లోపు ఆన్లైన్ క్లాసులు రద్దు చేస్తే మంచిదే అయితే దీనివల్ల డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉంది.
* ఆన్లైన్ విద్యని పూర్తిగా సెల్ ఫోన్ లేదా ట్యాబ్ లకు పరిమితం చేయకుండా భౌతిక అభ్యసన ప్రక్రియను జోడించాలి. అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, ఇంట్లో లభించే వస్తువులతో ప్రయోగాలు లాంటివి విద్యార్థులతో చేయించాలి.
* మొబైల్ ల్యాబరేటరీలు ఏర్పాటు చేయాలి.
* ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులలో ఎవరో ఒకరు విధిగా పిల్లల దగ్గర ఉండాలి. దీనికి సంబంధించి తల్లిదండ్రులలో చైతన్యం తీసుకురావాలి.
* ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి పెద్ద పాఠశాలలు, కళాశాలలకు తగిన వనరులు ఉండవచ్చు కానీ ప్రభుత్వ విద్యార్థులకు చాలా మందికి అవకాశం లభించకపోవచ్చు. ఇందుకు సంబంధించిన వనరుల గురించి ఆలోచించవలసి ఉంది.
* ఒకవేళ విద్యాసంస్థలు ప్రారంభించవలసి వస్తే విద్యార్థుల మధ్య భౌతిక దూరం, షిఫ్ట్ పద్ధతి, సిలబస్ తగ్గించడం, ఓపెన్ ఎయిర్ క్లాసులు లాంటి చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో సబ్జెక్టు నైపుణ్యాలు, ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించాలని కమిషన్ సూచించింది. కోవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస్లో ఆరోగ్య విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కమిషన్ సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వైస్ చైర్ పర్సన్ డాక్టర్ విజయ్ శారద రెడ్డి, కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి సభ్యులు పాల్గొన్నారు.













