ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఈయనకు పదోన్నతి కల్పించి ఆంధ్ర హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఆగస్టు నెలాఖరులో సిఫారసుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన నియామకంపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న మధప్రదేశ్‌లో జన్మించారు. 1985 నవంబరులో న్యాయవాద వృతిలో అడుగుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో నిష్ణాతుడిగా ఖ్యాతి గడించారు. 2005 నవంబరు 25న ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006 నవంబరు 25న అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఆ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.













