దుబాయ్‌కి వెళ్లిన జూ.ఎన్టీఆర్..! చంద్రబాబు అరెస్టుపై ఇక స్పందించరా..!?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది. దీంతో చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, కక్ష సాధింపులో భాగంగానే జగన్ ప్రభుత్వం ఇలా చేసిందని చాలా మంది సంఘీభావం తెలుపుతున్నారు. నందమూరి కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు అరెస్టును తప్పుబడుతున్నారు. కానీ హరికృష్ణ ఫ్యామిలీ మాత్రం చంద్రబాబు అరెస్టుపై నోరు మెదపలేదు. జూనియర్ ఎన్టీఆర్ కానీ, కల్యాణ్ రామ్ కానీ అస్సలు దీనిపై మాట్లాడలేదు. దీంతో వారిపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ పయనమయ్యారు. సైమా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు జూ.ఎన్టీఆర్ అక్కడికి వెళ్లారు. రెండ్రోజుల పాటు ఆయన దుబాయ్ లోనే ఉంటారని సమాచారం. బుధవారం వరకూ దేవర సినిమాకోసం అండర్ వాటర్ ట్రైనింగ్ లో బిజీ ఉన్న జూ.ఎన్టీఆర్ ఇప్పుడు దుబాయ్ వెళ్లిపోయారు. ఆర్ఆర్అర్ సినిమాలో నటించిన జూ.ఎన్టీఆర్ ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఉన్నారు. అందుకోసమే ఆయన అక్కడికి వెళ్లారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు అయి ఐదు రోజులైనా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కుటుంబంలో గ్యాప్ బాగా పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
గతంలో వైసీపీ నేతలు నందమూరి లక్ష్మీపార్వతి సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా ట్వీట్ చేశారు. అందులో కూడా ఎక్కడా భువనేశ్వరి పేరు ప్రస్తావించలేదు. కర్ర విరగకూడదు.. పాము చావకూడదు.. అన్నట్టు జనరల్ ట్వీట్ చేశారు. దీంతో అప్పుడు కూడా చాలా మంది నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ పై విరుచుకుపడ్డారు. వెళ్లి వైసీపీలో చేరాలని సూచించారు. ఇప్పుడు కూడా అలాంటి ట్రోలింగ్సే నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడి అరెస్టుపై స్పందిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ కు అంత టైమ్ లేదా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే నందమూరి కుటుంబంలో హరికృష్ణ ఫ్యామిలీ దూరమైపోయిందనే టాక్ నడుస్తోంది. మిగిలిన నందమూరి కుటుంబాలతో వాళ్లు సన్నిహితంగా ఉండట్లేదని.. మాటలు కూడా పెద్దగా లేవని తెలుస్తోంది. ఈ మధ్య సుహాసిని కుమార్తె పెళ్లికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరైనా అంటీముట్టనట్టే ఉన్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. హరికృష్ణ బతికి ఉన్నప్పుడు సంబంధాలు కాస్త మెరుగ్గా ఉండేవి. ఆయన చనిపోయాక కుమారులిద్దరూ దూరమైపోయారు. వాళ్లను కూడా మిగిలిన కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించట్లేదు. నారా ఫ్యామిలీ వల్లే నందమూరి కుటుంబంలో గ్యాప్ వచ్చిందా.. లేకుంటే ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా.. అనేది తెలీదు. మొత్తానికి చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.













