జూనియర్ ఎన్టీఆర్.. మళ్లీ టీడీపీలో యాక్టివ్ కానున్నారా..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ స్థాయిలో టీడీపీకి విజయం దక్కుతుందని గ్రహించని కొంతమంది నానా కూతలూ కూశారు. అప్పట్లో వాళ్లంతా ట్రోల్స్ కు గురయ్యారు. టీడీపీ నేతలు కూడా అలాంటి వాళ్లపై విమర్శలు గుప్పించారు. పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో ఇలా మౌనంగా ఉండడమో.. లేదంటే సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడమో తగదని హితవు పలికారు. అలా పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇప్పుడు పార్టీ భారీ విజయం సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఇటువైపు చూస్తారా అనే టాక్ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఘనవిజయం సాధించిన టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్తూ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. లోకేశ్ కు, బాలకృష్ణకు, భరత్ కు, పురంధేశ్వరికి కూడా అభినందనలు తెలిపారు. చాలాకాలంగా అంటీముట్టనట్టు ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇలా ట్వీట్లు చేయడంతో అందరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఒక్కసారిగా ఇంత మార్పేంటి అని ఆశ్చర్యపోయారు. గతంలో నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వైసీపీ నేతలు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో అందరూ ఎన్టీఆర్ కుటుంబానికి అండగా నిలిచారు.
కానీ జూనియర్ ఎన్టీఆర్ సోదరులు మాత్రం పట్టించుకోలేదు. రెండు మూడు రోజులు గడిచిన తర్వాత కనీసం పేరు లేకుండా జనరల్ ట్వీట్ ఒకటి వదిలారు. ఇది మరిన్ని విమర్శలకు తావిచ్చింది. పేరు పెట్టి మద్దతు పలికేందుకు కూడా మనసు రాలేదా అని టీడీపీ శ్రేణులు దుయ్యబట్టాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలివ్వాలని.. అతడిని చంద్రబాబు, లోకేశ్ తొక్కేశారని వైసీపీ నేతలు పలుమార్లు ఆరోపించారు. వాటిపై స్పందించి అలాంటిదేమీ లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్తే వాళ్ల విమర్శలకు చెక్ పడుతుందని టీడీపీ నేతలు భావించారు. అయినా జూనియర్ ఎన్టీఆర్ కిమ్మనకుండా ఉండిపోయారు.
ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో జూనియర్ ఎన్టీఆర్ సోదరులు చేసిన ట్వీట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. గ్యాప్ ను పూడ్చుకునేందుకు జూనియర్ సోదరిలిద్దరూ ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. నారా – నందమూరి ఫ్యామిలీలో వీళ్లిద్దరూ తప్ప అందరూ ఇప్పుడు ఏకతాటిపైనే ఉన్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఇప్పుడు నారా ఫ్యామిలీతో సఖ్యతగానే ఉంటోంది. ఇలాంటప్పుడు గ్యాప్ సరికాదనే ఫీలింగ్ జూనియర్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. పైగా వైసీపీ నాయకుల మద్దతు కూడా ఇప్పుడు వీళ్లకు కరువైంది. ఇలాంటప్పుడు కలిసుండడమే మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













