ఏపీ ప్రజలకు కేంద్రం ఇస్తున్న కానుక ఎయిమ్స్ : నడ్డా
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ భవనాలను నడ్డా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రధాని మోదీ ఎయిమ్స్ నెలకొల్పాలని నిర్ణయించారన్నారు. రూ.1618 కోట్లతో ఎయిమ్స్ నిర్మిస్తున్మామని తెలిపారు. గడువు కంటే ముందుగానే ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేస్తామని సృష్టం చేశారు.
ఏపీ ప్రజలకు కేంద్రం ఇస్తున్న కానుక ఎయిమ్స్ అని అన్నారు. ఆగస్ట్‌లో విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని, 2019 జనవరి నాటికి ఓపిడి బ్లాక్ సిద్ధంచేస్తామని తెలిపారు. ఎయిమ్స్‌లో బెస్ట్ ఫ్యాకల్టీని అందిస్తామని పేర్కొన్నారు. ఎయిమ్స్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం విలువైన 185 ఎకరాల భూమిని అందించిందని, అన్ని అనుమతులు త్వరితగతిని అందించామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నక్కా ఆనందబాబు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.













