తిరుపతి మరో ఐటి నగరం అవుతుంది.. జేపీ నడ్డా..
ఆంధ్రాలో ఎన్నికల జోరు మామూలుగా లేదు. ఈరోజుతో ప్రచారాలు ముగుస్తాయి.. అందుకే ఎక్కడ చూసినా పార్టీలు యుద్ధ ప్రాతిపదికన ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. తిరుపతిలో ఇవాళ ఎన్డీఏ కూటమి నిర్వహించిన భారీ రోడ్ షోలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. ఈ రోడ్ షో లో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన నడ్డా.. ఆంధ్రాలో ప్రస్తుతం మాఫియాలదే రాజ్యాం సాగుతోంది అని అన్నారు. ఇసుక దగ్గర నుంచి భూమి వరకు.. ఇలా ప్రతి ఒక్క విషయంలో మాఫియాగా నడుస్తోందని విమర్శించారు. ఆంధ్రాలో ప్రజల ఆశీర్వాదం ఎన్డీఏ కూటమికి ఉందని.. ఈసారి వారు దేనికి లొంగకుండా మంచినే గెలిపిస్తారని నడ్డా అన్నారు. ఇక తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం అని.. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తిరుపతిని మోదీ ఒక ఐటీ నగరంగా అభివృద్ధి చేస్తారని నడ్డా స్పష్టం చేశారు. దీనివల్ల ఇక్కడ ఎందరికో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని.. కానీ ప్రస్తుతం తిరుపతిలో అక్రమ పాలన కారణంగా ఎక్కడ చూసినా భూ దందాలు, కబ్జాలేనని ఆయన ఆరోపించారు. ఇక్కడ ఏ పని జరగాలన్న భూమన కుటుంబానికి ముడుపులు చెల్లించాల్సిందే అని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో తిరుపతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉండేవని.. జగన్ నిర్వాకం కారణంగా పరిశ్రమలు పారిపోతున్నాయని.. కొత్త కంపెనీలు కూడా రావడంలేదని లోకేష్ మండిపడ్డారు. రాయలసీమకు జగన్ ఒక క్యాన్సర్ గడ్డలా దాపరిచాడని విమర్శించారు.













