అది జగన్ స్కీం కాదు.. ప్రధాని మోదీది
ఆరోగ్యశ్రీ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, అది జగన్ స్కీం కాదని ప్రధాని నరేంద్ర మోదీదని బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ బూత్ కమిటీల్లో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలన్నారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకునే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. బీజేపీ అన్ని వర్గాల పార్టీ అనే భావన వచ్చేలా పనిచేయాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉంటుందని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ పేరుతో బృహత్తర ఆరోగ్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో రూ.5 లక్షల వరకు వైద్యసాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా పనిచేస్తుందని, రాష్ట్రం దాటితే ఆరోగ్యశ్రీ పనికిరాదని వ్యాఖ్యానించారు. ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. మన్‌కీ బాత్ ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని బూత్ స్థాయిలో కార్యకర్తలంతా సామూహికంగా వీక్షించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర బీజేపీ పుస్తకం విడుదల చేసిందని, అందులో విషయాలు ప్రజలకు చేరవేసేందుకు శక్తి కేంద్ర ప్రముఖులు చొరవ చూపాలన్నారు.













