Krishnam Raju: అమరావతి వివాద వ్యాఖ్యలపై స్పందించిన జర్నలిస్టు ..హైకోర్టులో పిటిషన్..

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు (Krishnam Raju) తనపై పెట్టిన కేసులు అన్యాయమని, తాను అమాయకుడినని చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న ప్రసారమైన సాక్షి ఛానెల్ (Sakshi Channel) డిబేట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అమరావతి (Amaravati) నగరాన్ని ‘వేశ్యల రాజధాని’గా పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆగ్రహానికి కారణమైంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆందోళనలు జరగడంతో పాటు సాక్షి కార్యాలయాల వద్ద మహిళలు నిరసనలు తెలిపారు.
ఈ ఘటనపై మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కంభంపాటి శిరీష (Kambhampati Sirisha) తుళ్లూరు (Thullur) పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఇందులో కృష్ణంరాజు ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొన్నారు. శ్రీకాకుళం (Srikakulam) నుంచి విశాఖపట్నం (Visakhapatnam) వస్తున్న సమయంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు.
తన వ్యాఖ్యలు ఓ పత్రికలో వచ్చిన కథనానికి ప్రతిస్పందన మాత్రమేనని, అవి మహిళలను అవమానించే ఉద్దేశంతో చేయలేదని కృష్ణంరాజు పిటిషన్ లో పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా చర్చల్లో పాల్గొన్నానని, తన జర్నలిస్టుగా జీవితం అంతా విలువలకే కట్టుబడి పని చేశానని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పులను ఉదహరిస్తూ, తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరారు. మంగళగిరి (Mangalagiri) కోర్టు తనపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను చట్టబద్ధంగా సరైనవి కాదని పోలీసులు తొలగించారని కూడా వివరించారు.
ఇవి అన్ని రాజకీయ కక్షపూరితంగా చేసిన చర్యలేనని, తనపై గతంలో ఎలాంటి కేసూ లేనని పేర్కొన్నారు. హైకోర్టు (High Court) ఈ విషయంపై విచారణ జరిపే అవకాశం సోమవారం ఉంది. ఇదిలా ఉండగా తుళ్లూరు పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలో తీసుకొని శనివారం రాత్రి 11 గంటల వరకూ విచారించారు. పలు ప్రశ్నలకు కృష్ణంరాజు ‘మర్చిపోయాను’, ‘తెలియదు’ అంటూ సమాధానమిచ్చినట్టు అధికారులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలు, విదేశీ ఖాతాల్లో వచ్చిన డబ్బులపై ప్రశ్నించగా వివరాలు తెలియవని చెప్పారు. న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.