జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారక సిరికోన నవలా రచనపోటీ : 2024 తుది ఫలితాల ప్రకటన
తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రోత్సహించడానికి సిరికోన సాహితీ అకాడెమీ (వాట్సప్) తరపున, స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారకంగా గత నాలుగు సంవత్సరాల నుంచి, ప్రతిఏడాదీ ఉత్తమ నవలారచన పోటీలను నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే!. నిర్దిష్ట అంశాన్ని ప్రకటిస్తూ, వచ్చిన రచనల్లో ఉత్తమ రచనకు ముప్ఫైవేల నగదు బహుమతితో కూడిన పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. నాాయనిర్ణేతల అభిప్రాయాల ననుసరించి, ఇతర రచయితలకు ప్రోత్సాహకంగా ఒకటి రెండు ప్రత్యేక బహుమతులను కూడా ప్రకటించడం జరుగుతున్నది.
2024 వ సంవత్సరానికి కథావస్తువును సూచించకుండా, రచయితలు తమకు నచ్చిన వస్తువుమీద తాజాగా రచించిన నవలలు పోటీకి సమర్పించవచ్చు అని ప్రకటించగా అనూహ్యమైన స్పందన లభించింది.. ఎక్కువమంది ప్రేమను కేంద్రవస్తువుగా తీసుకుని రాసినా, గణనీయ సంఖ్యలో ఆధునిక జీవన వైవిధ్యాన్ని చిత్రించే నవలలు రచించి పోటీకి సమర్పించారు.. ప్రాథమిక వడబోత పిమ్మట 26 నవలలు పోటీకి నిలిచాయి.
తర్వాత వాటిని మరొక నిర్ణేత పరిశీలించి ఎంపికచేసిన 7 నవలలను ముగ్గురు న్యాయనిర్ణేతలకు పంపడం జరిగింది. a. కథావవస్తువు, b. ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత/ తార్కికతలు, c. శైలి- శిల్పం, d. సామాజిక ప్రయోజనం అంశాల ఆధారంగా గుణపరిశీలన జరిగింది. ఫలితంగా ఈక్రింది రచనలు ఉత్తమ, ప్రత్యేక బహుమతులకు ఎంపికయ్యాయి.
(అ) ఉత్తమనవల:
‘కిలారి’: డా.బి.నాగశేషు
(ఆ) ప్రత్యేకబహుమతులు:
1. “కావేరికిఅటూఇటూ”: రెంటాలకల్పన
2. “ లింగాలకంఠంలో” : రంజిత్ గన్నోజు
(అ) ఉత్తమ, (ఆ) ప్రత్యేక బహుమతులకు ఎంపిక కాబడిన పై మూడునవలలు సిరికోనకు చాలా గర్వకారణంగా నిలుస్తాయి.
• అసాధారణ నిర్మాణచాతురితో, అద్భుత మాండలిక భాషాకథనంతో, సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తున్న నవల ‘కిలారి’
• మూడు తరాల నారీచేతనకు అద్దంపడుతున్న రచన ‘కావేరికి అటూఇటూ..’
• నల్లమల అడవుల్లోని చెంచుల జీవితాన్ని అత్యంత సన్నిహితంగా పరిచయం చేస్తున్న రచన ‘లింగాలకంఠంలో ‘
పై మూడు నవలలు నిస్సందేహంగా సిరికోనకు గర్వకారణంగా నిలిచే రచనలు. రచయితలు ముగ్గురికీ, సిరికోనీయులందరి పక్షాన మనఃపూర్వక అభినందనలు. వారికృషి తెలుగు సాహిత్యరంగంలో మరింత సమున్నత గౌరవ, ప్రతిష్టలను సముపార్జించు కొంటుందని మనసారా విశ్వసిస్తూ, శుభాకాంక్షలు అందిస్తున్నాము!
— జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం
(సిరికోన అడ్మిన్)













