Jogi Ramesh : టీడీపీలో చిచ్చు రేపిన జోగి రమేశ్..! నారా లోకేశ్ ఫైర్.!?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఇవాళ ఒక పార్టీలో ఉన్న నేతలు తెల్లారేసరికి మరో పార్టీలోకి వెళ్లిపోవచ్చు. మాట మార్చేయవచ్చు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి పరిస్థితులు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోయి ఎన్డీయే (NDA) అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల జంపింగ్ లు ఎక్కువయ్యాయి. వైసీపీ (YSRCP) నుంచి మెజారిటీ నేతలు బయటికొచ్చి కూటమి పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది కూటమి నేతలతో సంప్రదింపులు చేస్తూ లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా నూజివీడిలో టీడీపీ నేతలతో కలిసి వైసీపీ నేత జోగి రమేశ్ (Jogi Ramesh) ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఇలాంటి ఊహాగానాలకు తెరలేపింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేశ్ ఓ రేంజ్ లో యాక్టివ్ గా ఉండేవారు. టీడీపీపైన (TDP) విరుచుకు పడేవారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ టార్గెట్ గా ఆయన పరుష పదజాలంతో విమర్శలు గుప్పించేవారు. వైసీపీలోనే వసంత కృష్ణ ప్రసాదుతో (Vasantha Krishna Prasad) ఆయనకు పొసిగేది కాదు. వీళ్లిద్దరి మధ్య గ్యాప్ ఫిల్ చేసేందుకు జగన్ (YS Jagan) ఎంత ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. దీంతో వసంత కృష్ణ ప్రసాదు వైసీపీ నుంచి బయటికొచ్చేసి టీడీపీ తరపున మైలవరం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు జోగి రమేశ్ వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోవడంతో యాక్టివ్ పాలిటిక్స్ కు కాస్త విరామం ఇచ్చారు. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు ఆయన హాజరవుతున్నారు కూడా. మరోవైపు అగ్రి గోల్డ్ (Agri Gold) భూముల వ్యవహారంలో జోగి రమేశ్ కుమారుడిపై కేసు నమోదైంది. జోగి రమేశ్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని తెలుగు తమ్ముళ్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నూజివీడులో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి జోగి రమేశ్ పాల్గొనడం సంచలనం కలిగించింది. నూజివీడులో (Nuzivid) దివంగత నేత గౌతు లచ్చన్న (Gouthu Lachanna) విగ్రహావిష్కరణ జరిగింది. ఇందులో మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathi), ఎమ్మెల్యే గౌతు శిరీష (Gouthu Sirisha) పాల్గొన్నారు. ఇందులో జోగి రమేశ్ కూడా వీళ్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. సన్నిహితంగా మెలిగారు.
ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదేంటి అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇది గౌడ కుల సంఘం కార్యక్రమమని గౌతు శిరీష వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అంతమాత్రాన వాళ్లు, మనం ఒక్కటైపోయినట్లు కాదని వివరించారు. టీడీపీ నేతలతో కలిసి జోగి రమేశ్ పాల్గొనడంపై నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తానికి జోగి రమేశ్ టీడీపీలో పెద్ద చిచ్చుకు కారణమయ్యాడని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.













