ఏపీలో భారీ పెట్టుబడులతో మరో పారిశ్రామిక దిగ్గజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడులు పెట్టడానికి మరో పారిశ్రామిక దిగ్గజం ముందుకొచ్చింది. ఉక్కు, ఇంధన, సిమెంట్, మౌలిక సదుపాయాలు, క్రీడా రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాత జిందాల్ గ్రూపు రూ.3,500 కోట్లతో ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టులో రెండు జెట్టీల అభివృద్ధి, పైపులైన్ ప్రాజెక్టులు చేపట్టేందుకు దావోస్ వేదికగా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.
ప్రపంచ ఆర్థిక వేదికలో ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జిందాల్ గ్రూపు జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జస్ జిందాల్.. రాష్ట్ర మౌలిక సదుపాయాల (పోర్టులు) శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), మారిటైం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నారు. రామాయపట్నం పోర్టులో స్టాక్ యార్డు, పోర్టు కార్యకలాపాలకు సంబంధించి 200 ఎకరాల్లో రూ.1,000 కోట్లతో రెండు జెట్టీలు నిర్మిస్తారు. మరో రూ.2,500 కోట్లతో వైపులైను ఏర్పాటు చేస్తారు. రామాయపట్నం పోర్టు దగ్గర ఉక్కు పరిశ్రమ, రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల పరిశ్రమ, అపెరల్ పార్కు ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని ఈ సందర్భంగా సజ్జస్ జిందాల్ మంత్రి లోకేశ్‌కు హామీ ఇచ్చారు.
తమ బృందం ఇప్పటికే అనేకసార్లు ఏపీలో పర్యటించిందని, అభివృద్ధిని స్వయంగా చూడాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. సాంకేతికతను సంపూర్ణంగా వినియోగించుకునే నేతగా చంద్రబాబు దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని మంత్రి లోకేశ్ ఆయనకు వివరించారు. ఒప్పంద పత్రాలపై ఈడీబీ తరపున సీఈవో జాస్తి కృష్ణకిశోర్, పోర్టుల సంచాలకులు డాక్టర్ కె.ప్రవీణ్, జేఎస్‌డబ్ల్యూ నుంచి సంస్థ జేఎండీ, సీఈవో బీవీజీకే శర్మ సంతకాలు చేశారు.













