JC Prabhakar Reddy: బైరెడ్డి రప్పా రప్పా కు జేసీ ఘాటు కౌంటర్.. తాడిపత్రి లో టెన్షన్

ఇటీవలి రోజుల్లో ఏపీ రాజకీయాల్లో విపక్ష, అధికార పార్టీల మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. ముఖ్యంగా కొన్ని డైలాగులు, పదజాలం ప్రజల్లో సినిమా డైలాగులను మించి వైరల్ అయ్యే స్థాయిలో వినిపిస్తున్నాయి. “రప్పా రప్పా నరికేస్తాం!” అనే వ్యాఖ్య ఇటీవల వైసీపీ (YCP) నాయకుల నుంచి తరచూ వినిపిస్తోంది. ఈ తరహా వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినా, ఇంకొంతమంది అదే భాషలోనే ప్రతిస్పందించడాన్ని చూస్తున్నాం. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) కూడా ఇదే విషయం పై స్పందించి వార్తల్లో నిలిచారు.
రెండు రోజుల క్రితం వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy) తాడిపత్రి ప్రాంతానికి వచ్చారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై, ముఖ్యంగా జేసీ వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేసీ తనదైన శైలిలో బైరెడ్డికి గట్టి స్పందన ఇచ్చారు.
జేసీ మాట్లాడుతూ, “నీ ఊరు నాకు ఎంత దూరమో, నా ఊరు నీకూ అంతే దూరం. నువ్వు వచ్చి బెదిరిస్తే, మేమూ నీ దాకా వచ్చి చెబుతాం. బెదిరించడం కాదయ్యా, నీకు అక్కడే రప్పా రప్పా సినిమా చూపిస్తాం,” అని వ్యాఖ్యానించారు. అయితే దీంతోపాటుగా ఆయన తమ పార్టీ నేతలకు వైసీపీ ki మద్యం ఉన్న తేడా గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు.
తాము మాత్రం వైసీపీ నాయకుల మాదిరిగా బజారు భాష మాట్లాడబోమన్నారు. “అయినా వాళ్లను తిడితే మాకేం వస్తుంది? పైగా మా నాయకుడు చంద్రబాబు (Chandrababu Naidu) అలాంటి భాష వాడామంటే మమ్మల్ని అరుస్తారు. అలాంటి పదజాలం మాకు అవసరం లేదు” అని అన్నారు. బైరెడ్డిపై దూకుడుగా మాట్లాడుతూ, “నీవంటివాళ్లను ఎంతోమందిని చూశా. నువ్వెంత?.. నువ్వు పిల్లాడివి, నా గడ్డం, నెత్తి నెరిసిపోయాయి. నువ్వా నన్ను ఎక్కిరించేది? నీకే టికెట్ ఇవ్వడానికి మీ పార్టీ నాయకుడు వెనకడుతున్నాడు, ముందు వాటి గురించి ఆలోచించుకో” అని వ్యాఖ్యానించారు.
“శ్రమించి పని చేస్తే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే అక్కడికే పరిమితమవుతావు” అంటూ ఆయన చివరిగా హెచ్చరించారు. మొత్తానికి జేసీ వ్యాఖ్యలు మరోసారి తాడిపత్రిలో రాజకీయ వేడి పెంచాయి. రాజకీయ వేదికలు మాటల తూటాలతో మారుమ్రోగుతుండగా, ప్రజలు మాత్రం ఈ సంభాషణలను ఆసక్తిగా గమనిస్తున్నారు.