అలాంటి నేత మరో పదేళ్లు సీఎంగా ఉంటే తప్పేంటి?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసమే పని చేస్తున్నారని, అలాంటి నేత మరో పదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటే తప్పా? అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రైల్వే జోన్ కోసం విశాఖలో టీడీపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన దీక్షలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టేందుకు ముఖ్యమంత్రి తన శక్తి మేరకు పోరాడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే తనకు డిపాజిట్ కూడా వచ్చేది కాదన్నారు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి కూడా తాను ఏనాడూ పోలవరం ప్రాజెక్టు దగ్గరకే వెళ్లలేదన్నారు. కానీ చంద్రబాబు పట్టుదలతో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ప్రజలకు సంపూర్ణ ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని ముఖ్యమంత్రి తపన పడుతున్నారని అన్నారు.













