నా రాజకీయ జీవితంలో తొలిసారి…. జేసీ
రాష్ట్రంలో రాక్షస పాలన, పోలీసుల రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమర్శించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్షనిస్టుల తరహాలో ఐపీఎస్ అధికారి లాఠీతో మహిళలను విచక్షణా రహితంగా కొట్టడం తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చూస్తున్నానని, ఒక ఎస్పీ స్థాయి అధికారి అలా వ్యవహరించడం సరికాదని ఆక్షేపించారు. సీఎం జగన్ ఫ్యాక్షనిస్టు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలనలో కీలకమైన సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించే ఏకపక్ష నిర్ణయాలను విడనాడాలని ఆయన హితవు పలికారు. సామాన్య మానవుడు అనంతపురం నుంచి అమరావతికి వెళ్లి పనులు చూసుకుని రావడానికి 4 రోజుల సమయం పడుతుందని, అలాంటిది విశాఖ వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు.
రాజధాని అమరావతిలోనే కొనసాగాలని వైకాపా తప్ప అన్ని పార్టీలు సృష్టం చేశాయన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పారు. కియా లాంటి పరిశ్రమలు ప్రతి జిల్లాకు తెచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని, అంతే కానీ రాజధాని మార్పు లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దని వ్యాఖ్యానించారు. రాజధాని మార్పు నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందని అన్నారు.













