జగన్ ఏడాది పాలనకు 110మార్కులన్న తేదేపా ఎంపి…
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పనితీరుకేం బ్రహ్మాండం. ఆయన పాలనకు నూటికి నూరు మాత్రమే ఏంటి? నూటికి నూట పదిమార్కులేస్తా’’ ఈ మాటలు ఏ వైసీపీ నేతవో లేక ఏ పార్టీకి చెందని ప్రముఖుడివో కావు. పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుందేమో అన్నంత శతృత్వం ఉన్న ప్రత్యర్ధి పార్టీ తెలుగుదేశంకు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడివి. మరి ఆ ఎంపి గారు అంతగా ఎందుకు జగన్‌ని అలా పొగిడేశారు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయి తర్వాత తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న నేతలు కొందరే ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి నేతల్లో ముందు వరుసలో ఉంటారు అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి. ఎపిలో అత్యంత సీనియర్ రాజకీయనాయకుడైన జెసి దివాకర్‌రెడ్డి ఎప్పుడు ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన నాలుగు లైన్లే మాట్లాడినా… మీడియాకు రోజంతా సరిపడా ఫుడ్ దొరుకుతుంది.
వైఎస్సార్ మరణం తర్వాత సుదీర్ఘ అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి చిరకాల ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసిన దివాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తనదైన శైలిలో జగన్ మీద సెటైర్లు పేల్చుతూ వచ్చారు. అప్పుడప్పుడు స్వపక్షం మీదా చంద్రబాబు మీద కూడా వ్యంగ్యాస్థ్రాలూ సంధించారు. తద్వారా తన మాటలకు మంచి అలా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన జెసి దివాకర్‌రెడ్డి… మరోసారి గొంతు విప్పారు. తాజాగా సోమవారం జగన్ ఏడాది పాలనపై స్పందించమన్నప్పుడు ఆయన తనదైన శైలిలో స్పందించారు.
‘‘జగన్ పరిపాలన బ్రహ్మాండం. ఆయన పాలనకు నూటికి నూరేంటి నూటపది మార్కులు వేస్తా’’నంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. ‘‘జగన్ ఎవరి మాటా వినే పరిస్థితి లేదు. కోర్టుల మాట కూడా ఆయన వినడు’’అంటూ స్పష్టం చేశారు. ‘‘దేశంలో ఎవరికి జగన్ భయపడడడు. కేవలం ప్రధానమంత్రి మోడీకి తప్ప’’అంటూ జగన్ మీద కేసులున్న సంగతి పరోక్షంగా ప్రస్తావించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ విషయంలో సుప్రింకోర్టుకు వెళ్లే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఉందన్నారు. ‘‘ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ఇప్పడిప్పుడే చదువుకున్నవారికి అర్ధమవుతోంది. త్వరలో అందరికీ తెలుస్తుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉన్నందుకు బాధపడుతున్నానన్నారు.













