జేసీ దివాకర్‌రెడ్డి సంచలన ప్రకటన
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా అందుకే రాజీనామా చేస్తున్నానని అన్నారు. స్వీకర్ విదేశీ పర్యటనలో ఉండటంతో సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్లు చెప్పారు. అనంతరం బుధవారం తన రాజీనామా లేఖ లోక్‌సభ స్పీకర్‌కు అందజేస్తానని సృష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో మాత్రం తాను కొనసాగుతానని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడే సమర్ధుడని, మరోసారి అయనే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
అనంతపురంలో పారిశుద్ధ్య సమస్యను కూడా పరిష్కరించలేకపోవడం, రోడ్డు వెడల్పు చేయలేకపోవడం, చాగల్లు రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకు రాలేకపోవడం తదితర అంశాల్లో బాధ్యత కల్గిన ప్రజాప్రతినిధిగా తాను విఫలమయ్యానని అన్నారు. అనంతపురం అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డుతగిలాయని ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి దయాదాక్షిణ్యాలపై బతకలేదన్నారు. తన ఆత్మ ప్రబోధానుసారం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.













