JC Diwakar Reddy: బాబు, లోకేష్ రాజకీయల పై దివాకర్ రెడ్డి వైరల్ స్టేట్మెంట్..
సీనియర్ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి(J. C. Diwakar Reddy) చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన అభిప్రాయం ప్రకారం, చంద్రబాబు నాయుడు(Chandrababu) పూర్తిగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగకపోవచ్చని, ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్ళే అవకాశముందని పేర్కొన్నారు. అంతే కాకుండా, చంద్రబాబు స్థానంలో ఆయన కుమారుడు నారా లోకేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దివాకర్ రెడ్డి గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడూ రాజకీయాల గురించి తన విశ్లేషణలు పంచుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ హయాంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆయన, రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురం జిల్లాలో టీడీపీ బలోపేతానికి జేసీ కుటుంబం ఎంతో కృషి చేసింది. ప్రస్తుతం ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే, వీరి మేనల్లుడు దీపక్ రెడ్డి సీడాప్ చైర్మన్ పదవిని నిర్వహిస్తున్నారు.
తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న దివాకర్ రెడ్డి, చంద్రబాబు త్వరలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారతారని అన్నారు. ఇది చంద్రబాబు బలవంతంగా పదవి వదలడం కాదని, దేశ రాజకీయాల్లో ఆయన నైపుణ్యానికి అవసరమని తెలిపారు. దేశ స్థాయిలో చంద్రబాబు మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, ఇలాంటి అనుభవం దేశ రాజకీయాలకు అవసరమని చెప్పారు. అయితే ఈ మార్పు వచ్చే ఎన్నికల ముందే జరిగే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇక, డిప్యూటీ సీఎం పదవిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. పవన్ కల్యాణ్ గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి అంచనాలు వేయడం తన వల్ల కాదని అన్నారు. ఇటీవల ఏపీలో డిప్యూటీ సీఎం అంశం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ-జనసేన మద్దతుదారుల మధ్య దీనిపై చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని రెండు పార్టీలూ తమ కార్యకర్తలకు సూచించాయి. అయినప్పటికీ, మంత్రి టీజీ భరత్ “కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్” అంటూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు అసంతృప్తికి కారణమయ్యాయి.
ఇప్పుడు సీనియర్ నేత దివాకర్ రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని పంచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. చంద్రబాబు తన తర్వాత ముఖ్యమంత్రిగా లోకేశ్‌ను ప్రవేశపెడతారనే ఊహాగానాలకు ఇది బలంగా మారింది. అయితే చంద్రబాబు నిజంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారా? లేక ఐదేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగుతారా? అనే ప్రశ్నలు ఇంకా అనిశ్చితంగానే ఉన్నాయి. దీని పై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













