రైతులతో కలిసి న్యాయపోరాటం చేస్తాం – జయరాం కోమటి
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మందికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలి గాని స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో మాట మార్చి వేల మంది రైతుల జీవితాలను, కోట్ల మంది ప్రజల భవిష్యత్తును కాలరాసే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని ఎన్నారై ప్రముఖులు జయరాం కోమటి అన్నారు. అమరావతి నిర్మాణానికి తమ పంటభూములను వదులుకున్న రైతులను ఇబ్బందులపాలు చేయడం మంచిది కాదని అంటూ, తాము రైతుల తరపున ఈ బిల్లులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. జయరాంకోమటి ఆధ్వర్యంలో అమరావతి రైతులకు మద్దతుగా ఎన్నారైలు క్యాండిల్లైట్ ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అమరావతిపై నిర్ణయం తీసుకునేటపుడు ముఖ్యమంత్రి గాని, గవర్నర్ గాని మొత్తం ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకుని నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు.
మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా ప్రాక్టికల్ గా సాధ్యం కాలేదని, అది ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని అభిప్రాయ పడ్డారు. ఈరోజు దేశంలో ఆదాయ పరంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయని…దీనికి ఉపాధి, ఉద్యోగ, వ్యాపార కేంద్రాలైన మహానగరాలు ముంబై, చెన్నై, కోచి, అహ్మదాబాద్, బెంగుళూరు, హైదరాబాదు వాటిలో ఉండటమే కారణమని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భావి తరాలకు దారి చూపేలా అమరావతి మహానగరం నిర్మాణానికి ప్రణాళిక రచించారని అన్నారు. మూడు పంటలు వేసుకుని ఏటా లక్షలు సంపాదిస్తూ హాయిగా బతికే అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం ప్రభుత్వం మాట నమ్మి తమ పంట పొలాలను రాజధానికి ఇచ్చేశారన్నారు. అది త్యాగం మాత్రమే కాదని, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం అన్నారు. నేడు ఆ నమ్మకం పోయేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి బిల్లును రూపొందించినా, గవర్నర్ దానిని ఆమోదించి చట్టమయ్యేలా మార్చినా… రాజ్యాంగం ద్వారా ఏర్పడిన పునర్విభజన చట్టం ప్రకారం ఇది చెల్లుబాటు కాదన్నారు. అమరావతి రైతులకు అండగా ఎన్నారైలంతా కలసి న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. రాజ్యాంగం కంటే ఈ దేశంలో ఏదీ శక్తిమంతమైనది లేదని…. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించే కోర్టుల ద్వారా అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు.













