ప్రభుత్వస్కూళ్ల అభివృద్ధికి మరోసారి జన్మభూమి కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా పనిచేయాలని, ప్రచార ఆర్భాటం కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అంటూ, బడి ఈడు పిల్లలు బయట ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు, ఇందుకోసం విద్యారంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వచ్చే 10 -20 ఏళ్లకు ఏమి అవసరమో గుర్తించి అందుకనుగుణంగా బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. విద్యార్థుల నమోదు 100 శాతం జరగాలని, గ్రాడ్యుయేషన్ వరకు మానిటరింగ్ జరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీఏఏఆర్ ద్వారా ప్రతి విద్యార్ధికి ఒక ఐడీ ఇవ్వాలన్నారు.
ప్రైవేటు స్కూళ్లలో మాదిరిగా ప్రభుత్వ పాఠశాల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్‌లు పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. కర్నూలు జిల్లాలో వలస కార్మికుల పిల్లలు స్కూళ్లకు దూరం అవుతు న్నారని అధికారులు చెప్పగా, వారిని రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించి విద్యను అందించాలని సూచించారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద పెద్ద క్రీడా మైదానాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ రిపోర్ట్‌తో పాటు స్పోర్ట్స్ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలని అన్నారు. జీవో నెంబర్ 117పై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. స్కూళ్లలో ఇంగ్లీష్ తో పాటు మాతృభాష తెలుగుకు కూడా తగు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తెచ్చి ప్రోత్సహిం చింది గత ప్రభుత్వమేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని, పెద్ద సంఖ్యలో డ్రాపౌట్స్ పెరిగాయని ఆందోళన వ్యక్తంచేస్తూ డ్రాపౌట్స్ అడ్డుకట్టపై దృష్టిపెట్టి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ కూడా ఇవ్వాలని సీఎం అన్నారు. త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఆయా గ్రామాల్లో ఎవరైనా పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలన్నారు.
గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లినవారు తమ పాఠశాల అభివృద్ధికి ఆసక్తి చూపుతారని అలాంటి వారికి అవకాశం ఇవ్వాలన్నారు. మధ్యాహ్న భోజనం అమలులో లోపాలకు తావులేదని. పిల్లలకు పెట్టే ఆహారంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల నుంచి విడివిడిగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని అన్నారు. దీని కోసం ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంభించాలని అన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ అందించే కాలేజీల్లో ఉన్న పెండిరగ్ పోస్టులు భర్తీ చెయ్యాలని సీఎం ఆదేశించారు. టీచర్స్‌కు కూడా నిరంతరం లీడర్ షిప్ ట్క్రెనింగ్ అందించాలని అన్నారు. పాఠశాలల్లో జరిగే అంతర్గత పరీక్షల నిర్వహణ నిర్దేశిత ప్రమాణాలతో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఎం అన్నారు.













