క్లాస్‌వార్..
పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ క్లాస్ వార్ నినాదాన్ని అందుకున్నారు. అంతేకాదు.. దీనికి సంబంధించి వైసీపీ నేతలు పోస్టర్లతో హంగామా చేశారు. ఇందులో పేదలవైపు జగన్.. పల్లకీపై చంద్రబాబు ఉండగా, దాన్ని పవన్ నడుపుతున్నట్లు చూపించారు. దీన్ని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుండడంతో.. జనసేనాని గట్టిగానే కౌంటరిచ్చారు. డబ్బు లేని వారిని సంపన్నులు దోచుకునే పెత్తందారీ విధానాన్ని సీఎం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చూపించారు. రోజు కూలీ చేసుకునే 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు.. 32 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఇసుక విక్రయాలను బినామీలకు అప్పగించి 50 వేల మంది నదిలో ఇసుక తీసే కార్మికుల ఉసురు పోసుకున్నారు. పైగా నన్ను పెత్తందారీ అంటున్నారు. అధికారం, సంపద లేకున్నా సొంత డబ్బులు రైతులకు పంచే నేను ఎలా పెత్తందారుడిని అవుతాను. సీఎంకు ఆ మాట అనే అర్హత లేదు పవన్ తీవ్రంగా మండిపడ్డారు.
తాను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే..తన వ్యక్తిగత జీవితం గురించి సీఎం జగన్ మాట్లాడుతున్నారని పవన్ మండిపడ్డారు. జగన్‌రెడ్డీ చెవులు రిక్కించి విను.. నీ జీవితంలో అణువణువూ నాకు తెలుసు. మీరు హైదరాబాద్‌లో ఏం చేశారో నాకు బాగా తెలుసు. నీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలంటే ఓ వ్యక్తిని నా వద్దకు పంపు. ఆ విషయాలు వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది. నేను మీలా సంస్కారం లేకుండా చిల్లర మాటలు మాట్లాడను. నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినా నా వెంట్రుకతో సమానం అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతే కాదు…. వైసీపీ నేతలు నోటికి సైలెన్సర్లు బిగించుకోవాలని గట్టిగా కౌంటరిచ్చారు.
వైసీపీ ఎమ్మెల్యేలు భూబకాసురుల్లా మారారని.. సహజవనరులను దోచుకుంటున్నారని జనసేన ఆరోపిస్తోంది. పేద ప్రజల కష్టార్జితాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని జనసేనాని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పేద ప్రజల భూములను కబ్జా చేస్తూ, వారి కష్టార్జితాన్ని స్వాహా చేస్తున్న వైసీపీ నేతలకు పేదల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. అప్పులు చేసి బటన్ నొక్కుతున్న జగన్.. ఆ అప్పులను ప్రజలనెత్తినే రుద్దుతున్నారన్నారు. పేదల పక్షమంటే బడుగుల ఇళ్లను కూలగొట్టడం కాదన్నారు. ప్రతీకార దాడులకు దిగడం కాదన్నారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల వేధించడం కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
బీసీ ఓటుబ్యాంకు లక్ష్యంగా పార్టీలు అడుగులేస్తున్నాయి. ఈక్రమంలో బీసీలకు జగన్ సర్కార్ చేసిందేమీ లేదంటూ టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపిస్తున్నాయి. అంతేకాదు మామయ్య అని పిలిపించుకుంటూ.. వారికి ఉన్న అవకాశాలను సైతం దూరం చేస్తున్నారని ఉదాహరణలతో ఆక్షేపిస్తున్నాయి. దీంతో క్లాస్ వార్ అంశాన్ని తెరపైకి తెచ్చింది వైసీపీ. అంతేకాదు అత్యంత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీనికి జనసేన సైతం అంటే ఘాటుగా జవాబిస్తోంది.













