జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత కూడా.. అవి తప్పడం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని పరిగణించడకుండా జిల్లాల విభజన చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారని విమర్శించారు. విభజన లోపభూయిష్టంగా సాగిందని, జిల్లా డిమాండ్ ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం అధ్యయనం కూడా చేయలేదన్నారు. కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయని, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కూడా అవి తప్పడం లేదన్నారు.
జిల్లాల విభజనతో ముంపు మండలాల గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతాయని, జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల అభిప్రాయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని తెలిపారు. మదనపల్లె, హిందూపురం, మార్కాపురం జిల్లా కేంద్రాలుగా ఉండాలని ప్రధాన డిమాండ్లు వచ్చాయన్నారు. ఈ విషయంలో ప్రజల నిరసనకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.













