పిఠాపురం నుంచే పోటీ..! స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై చాలాకాలంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన పోటీ చేసే స్థానంపై క్లారిటీ వస్తే ఎత్తులు పైఎత్తులు వేసేందుకు ప్రత్యర్థి పార్టీ కూడా వేచి చూస్తోంది. అయితే ఇప్పుడు ఆ ఉత్కంఠకు పవన్ కల్యాణ్ స్వయంగా బ్రేక్ వేశారు. పిఠాపురం నుంచి తాను బరిలోకి దిగబోతున్నట్టు స్వయంగా వెల్లడించారు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని కూడా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పిఠాపురంలో వైసీపీ నేత వంగా గీత, పవన్ కల్యాణ్ మధ్య పోటీ ఖాయమైంది.
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం కీలక నియోజకవర్గం. ఇక్కడ కాపు సామాజిక ఓటర్లు ఎక్కువ. అందుకే ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే బాగుంటుందని చాలాకాలంగా ఆయన అభిమానులు, సామాజిక వర్గ నేతలు కోరుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ పోటీ చేసే స్థానంపై పట్టించుకోలేదు. ఇప్పుడు జాబితా ప్రకటించాల్సిన సమయం ఆసన్నం కావడంతో ప్రకటన చేయాల్సి వచ్చింది. పిఠాపురంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెండె దొరబాబు విజయం సాధించారు. ఈసారి అక్కడి నుంచి వంగా గీతను బరిలోకి దింపుతోంది వైసీపీ.
పిఠాపురంలో మొత్తం 2,28,206 ఓట్లున్నాయి. అందులో 1,14,261 మంది పురుషులు కాగా.. మహిళా ఓటర్లు 1,13,942 మంది ఉన్నారు. ఇతరులు ముగ్గురున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు 91,000లకు పైగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానం బీసీలది. అందుకే ఇక్కడ కాపుల ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి ఆ తప్పు చేయదలుచుకోలేదు. సేఫ్ జోన్ చూసుకున్నారు. సొంత సామాజిక వర్గంతో పాటు టీడీపీ, బీజేపీతో పొత్తు కలిసొస్తుందని పవన్ బావిస్తున్నారు.
అయితే పిఠాపురం స్థానం తనకే కేటాయించాలని టీడీపీ నేత వర్మ గట్టిగా పట్టుబడుతున్నారు. 2014 టీడీపీ రెబెల్ గా పోటీ విజయం సాధించిన సత్తా ఆయనకు ఉంది. అందుకే తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఆయన సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు పవన్ పోటీ చేస్తుండడంతో వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.













